విప్లవపు వేదికపై అశ్లీల తాండవం – ఇదేనా గద్దర్‌కి నివాళి?

  • గద్దర్‌ పేరును వాణిజ్యానికి వాడుకుంటే.. అది గద్దర్‌ను అవమానించడమే!
  • రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు – ప్రజాసంఘాల ఆవేదన

“యుద్ధంలో యోధుడిని తుపాకీ ముద్దాడుతుంది…
తూటాలే ముద్దుపెడతాయి!
ఒరిగిన వీరులని భూతల్లి ముద్దాడుతుంది –

అదే రణభూమి!”
ఇలాంటి శక్తివంతమైన పదాలతో ప్రజల గుండెల్లో

ముద్ర వేసిన ప్రజా గాయకుడు గద్దర్‌.

హైదరాబాద్‌, జూన్ 15 (విశ్వం న్యూస్): ఇప్పుడు గద్దర్‌ పేరుతో ఏర్పాటుచేసిన అవార్డుల వేడుకలు, వాటి ప్రదానోత్సవ పద్ధతి, అందులో ఎంపికైన వ్యక్తుల గురించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల కోసం పాటలు రాసిన గద్దర్‌ పేరిట… వాణిజ్యధోరణి సినిమాలకు, అసామాజిక అంశాలతో నిండిన చిత్రాల సృష్టికర్తలకు అవార్డులు ఇవ్వడం తగదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

కళ గానీ, గ్లామర్ గానీ కాదు –
ప్రజల కోసమే గద్దర్‌ సాహిత్యం
సామాజిక స్పృహ, ప్రజా బాధ్యతలతో నిండిన గద్దర్‌ జీవితానికి విరుద్ధంగా… అవార్డు కార్యక్రమాన్ని వినోదం, అశ్లీలతతో నింపడం బాధాకరమని పేర్కొంటున్నారు. “ఓకే అంటే ఓయోకు రానా” అంటూ నర్తించిన స్టేజ్‌పై గద్దర్‌ ఆత్మ తలపట్టుకుని ఏడుస్తుందని ప్రజా కళాకారులు వ్యాఖ్యానించారు.

గద్దర్‌ బొమ్మకే చోటు లేని అవార్డు –
అవమానం కాక మరేమిటి?
నంది అవార్డుపై నంది బొమ్మ ఉన్నట్టే, గద్దర్ అవార్డుపై కూడా ఆయన బొమ్మ ఉండాల్సిందని పలువురు స్పష్టం చేస్తున్నారు. గద్దర్‌ కుటుంబం కూడా ఈ అవార్డు వ్యవహారంలో భాగస్వాములవడం బాధాకరమని తెలిపారు.

ఇది కులహేతువాద విధానాల ప్రతిఫలం
అవార్డు వెనుక రేవంత్ రెడ్డి ఆలోచనా ధోరణి కుల స్వభావానికి నిదర్శనంగా చూపబడుతోందని విమర్శలొస్తున్నాయి. గద్దర్ భావజాలానికి విరుద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా… సామాజిక అసమానతలపై పోరాటం చేసిన గద్దర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం తెలంగాణ విలువలకు వ్యతిరేకమని విమర్శకులు పేర్కొన్నారు.

గద్దర్‌ను వ్యాపారానికి వాడుకుంటే
ప్రజలు మౌనంగా ఉండరట
గద్దర్‌ జీవితంలో ఎన్నో ప్రభుత్వ అవార్డులను తిరస్కరించినవాడు. అలాంటి వ్యక్తి పేరుతో కమర్షియల్ మద్దతుతో అవార్డులు ఇవ్వడం – అది గద్దర్‌ ఆశయాలను తుడిచిపెట్టడమే అని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

గద్దర్ పాటలు – పోరాటపు ఆయుధాలు
ఇంద్రవెల్లి మారణహోమంపై గద్దర్ రాసిన పాటలు, వైఎస్సార్ హయాంలో శాంతి చర్చల ముసుగులో జరిగిన మోసాలపై ఆయన కమ్మిన గీతాలు… చరిత్రలో నిలిచిపోయాయి. అలాంటి గద్దర్‌కు “రజాకార్” లాంటి సినిమాకు అవార్డు ఇచ్చే దుశ్చర్యకు పాల్పడడం ద్వారా రేవంత్ తన ఆర్ఎస్సెస్ భావజాలాన్ని బహిర్గతం చేశాడని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ గౌరవానికి గద్దర్‌ ప్రాతినిధ్యం –
ఆయన పేరును కలుషితం చేయొద్దు
గద్దర్ పేరుతో “విష సంస్కృతిని” ప్రోత్సహించకూడదని, ఆయన ఆశయాలను ధ్వంసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించకూడదని ప్రజాసంఘాలు, ప్రజా కళాకారులు, మేధావులు పిలుపునిస్తున్నారు.

తెలంగాణ పాటను కాపాడుకుందాం
తెలంగాణ సంస్కృతిని నిలబెడదాం
గద్దర్ ఆశయాలకు న్యాయం చేద్దాం
జై తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *