
హైదరాబాద్, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : హబ్సిగూడలోనే మరో ఘరో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో 6వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాక డివిజన్ హనుమాన్ నగర్‌కు చెందిన సంతోషి, నీల్ కుమార్ దంపతుల పెద్ద కూతురు కామేశ్వరి (10) స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. కామేశ్వరి తమ్ముడు వేదాంశ్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు.
రోజులాగే సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలను తీసుకుని తల్లి సంతోషి స్కూటీపై ఇంటికి బయలుదేరారు. హబ్సిగూడకు చేరుకోగానే.. పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ ఉన్నట్లుండి లెఫ్ట్‌సైడ్ దూసుకొచ్చింది. దీంతో లారీ స్కూటీకి తగలటంతో అందరు కింద పడిపోయారు.
కామేశ్వరి కాళ్ల పైనుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లటంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా.. బ్లడ్ లాస్ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూతురిని పట్టుకొని.. తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. లారీ డ్రైవర్ మియారామ్ జట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.