పోలీసుల నిర్లక్ష్యంతో దొంగలకు ధైర్యమా?

నాగారం, ఫిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : నాగారం మండలంలోని *పసుపూరు గ్రామంలో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత పది రోజులుగా అర్ధరాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నా, పోలీసుల నుంచి తగిన స్పందన కనిపించడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇత్తడి బిందెలు, చీరలు, స్టీల్ సామాను వంటి గృహోపకరణాలు దొంగల బారిన పడుతుండటంతో గ్రామస్తులు రాత్రిళ్లు తామే గస్తీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. “మేమే జాగారం చేయాలంటే పోలీసుల బాధ్యత ఏమిటి?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
గ్రామంలో నైట్ ప్యాట్రోలింగ్ లేకపోవడం, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే దొంగలు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుస సంఘటనలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఒక్క నిందితుడినీ పట్టుకోలేకపోవడం పోలీసు వైఫల్యమనే విమర్శలకు దారి తీస్తోంది.
ఇకనైనా పోలీసులు అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. పసుపూరు గ్రామంలో భద్రతా పరిస్థితిని తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.