కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఖాయం: బండి సంజయ్

కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఖాయం: బండి సంజయ్

విశ్వం న్యూస్, కరీంనగర్, ఫిబ్రవరి 6 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యానగర్ 21వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొండపల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలు కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, ఆయన మాటలే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. అటువంటి నాయకత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే బీఆర్ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పిస్తూ, పదేళ్ల పాలనలో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. తాను కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి హోదాలో పార్లమెంట్ నియోజకవర్గం, నగర అభివృద్ధికి దాదాపు రూ.1400 కోట్ల కేంద్ర నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.

ఈసారి కూడా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధి కంటే పన్నులు, టాక్సుల భారం పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. నగర అభివృద్ధి కావాలా? లేక పన్నుల భారం కావాలా? అనే విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి కరీంనగర్‌కు కేంద్ర నిధుల వరద తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

కావున 21వ డివిజన్‌లో పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కొండపల్లి సతీష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఓటర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *