మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు బీఆర్ఎస్ డిమాండ్

పొంగులేటి బర్తరఫ్‌కు
బీఆర్ఎస్ డిమాండ్

హైదరాబాద్,మార్చి 29 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో అక్రమ మైనింగ్, అవినీతి వ్యవహారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

శాసనసభ పక్ష ఉపనేత టి. హరీష్ రావు బయటపెట్టిన వివరాల ఆధారంగా మంత్రి కుటుంబానికి చెందిన సంస్థ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఇతర సంస్థలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఈ సంస్థపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మంత్రి కుటుంబ సభ్యులకు కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, గతంలో ఆయనే ఛైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి ప్రకటనల్లో విరుద్ధతలు ఉన్నాయని విమర్శించారు. అక్రమాలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి వెళ్లి ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

మైనింగ్ అక్రమాలను చిన్న విషయంగా చూపించడం సరికాదని, వాస్తవానికి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన మైనింగ్ ఆదాయం పూర్తిగా రావడం లేదని, భారీగా నిధులు మళ్లుతున్నాయని అన్నారు.

హైదరాబాద్ మెట్రో అంశంపై కూడా కేటీఆర్ స్పందిస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. మెట్రో భూములు ప్రభుత్వానివేనని, ప్రైవేట్ సంస్థల అప్పులను ప్రజలపై మోపడం తగదన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *