బీఆర్ఎస్ ఎమ్మెల్యే… కాంగ్రెస్ కోఆర్డినేటరా?

హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2026 (విశ్వం న్యూస్):తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోసం టీపీసీసీ విడుదల చేసిన కోఆర్డినేటర్ల జాబితా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు దర్శనమిచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్‌నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో ఉండడం చర్చనీయాంశమైంది.

ఇక్కడ మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ముగ్గురూ పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ ఎదుట వివాదంలో చిక్కుకున్నవారే. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరఫున 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు దాఖలైంది. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగిలిన 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లిన్ చిట్ ఇచ్చారు.“పార్టీ మారారని నిరూపించే ఆధారాలేవీ లేవు… వారు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు” అని స్పీకర్ తేల్చి చెప్పడం తెలిసిందే. అటువంటి నేపథ్యంలో, ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

కారు గుర్తుపై ఉన్న ఎమ్మెల్యేలే హస్తం ప్రచారానికి దిగడం… ఇది రాజకీయ వ్యూహమా? లేక కాంగ్రెస్ కొత్త ఆటనా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *