సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

  • లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత
  • 26వ తేదీన విచారణకు హాజరుకాలేను

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు.

గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉంది. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుంది.

సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు… పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుంది. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. నియమనిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను.

కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *