రాష్ట్రవ్యాప్తంగా రేపు
బిఆర్ఎస్ నిరసనలు

- కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
హైదరాబాద్, జనవరి 31, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వివేక్, కృష్ణారావు తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ గారిని వేధిస్తోందని, రాజకీయ కక్షతో ఆయనను అవమానిస్తూ అమానుషంగా వ్యవహరిస్తోందని నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ (SIT) విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించారు.

రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ప్రతి మున్సిపల్ మరియు నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ తమ జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. నిరసనలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించాలని బిఆర్ఎస్ నేతలు కోరారు.