SIT వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన

మున్సిపల్ ఎన్నికల్లో
బుద్ధి చెబుతాం : దాసోజు

కొమురం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 1, 2026 (విశ్వం న్యూస్) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ వేధింపులు, అక్రమ SIT విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారి నివాసం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రావణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు పాల్గొని నిరసనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

నిరసన అనంతరం ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో అక్రమ కేసులు, SIT విచారణల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నారన్న కారణంతోనే ఈ చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.

ప్రజా సమస్యలను పక్కన పెట్టి నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, విమర్శించే వారిపై కక్షపూరిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇక మభ్యపెట్టలేదని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *