భూ కబ్జాదారులపై BRS ధర్మయుద్ధం: శ్రవణ్ హెచ్చరిక

ప్రజల భూముల రక్షణకు
BRS ధర్మయుద్ధం: దాసోజు ఫైర్

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూదోపిడీ పెరుగుతోందని ఆరోపిస్తూ BRS నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ముసుగులో రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఖాళీ భూములను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

BRS నాయకులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావు తదితరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నాదర్గుల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 613లో సుమారు 373 ఎకరాల భూమి వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఈ భూమి ప్రభుత్వానికి చెందాల్సి ఉన్నప్పటికీ అక్రమంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. హైకోర్టు కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నప్పటికీ, నకిలీ పత్రాలతో నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

మానసా హిల్స్, వట్టినాగులపల్లి, కొండాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూదోపిడీ జరుగుతోందని తెలిపారు. రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని, ఈ వ్యవహారంలో కొంతమంది మంత్రులు, అధికారులు భాగస్వాములయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు స్పందించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, RDO, MRO స్థాయి అధికారులపై కూడా విచారణ జరిపించాలని అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించి, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భూములను కాపాడేందుకు BRS పార్టీ ధర్మయుద్ధం కొనసాగిస్తుందని శ్రవణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *