బస్సు ఛార్జీల పెంపు – ఆర్టీసీ నిర్ణయంతో ప్రయాణికుల్లో ఆగ్రహం!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (విశ్వం న్యూస్‌): హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. నగర సిటీ బస్సు సర్వీసుల్లో టికెట్‌ ఛార్జీల పెంపు ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.5 నుంచి రూ.10 వరకు ఛార్జీలు పెరగనున్నాయి.

మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు, నాలుగో స్టేజ్‌ నుంచి రూ.10 పెంపు అమలులోకి రానుంది. ఈ పెంచిన ఛార్జీలు అక్టోబర్‌ 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో కూడా ఫస్ట్‌ స్టేజ్‌కు రూ.5, రెండో స్టేజ్‌ నుంచి రూ.10 పెంపు వర్తించనుంది. దీంతో హైదరాబాద్‌ సిటీ బస్సు ప్రయాణం చేసేవారిపై అదనపు భారం పడనుంది.

ఎందుకు పెంపు? టీజీఎస్‌ఆర్టీసీ వివరణ

బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టతనిచ్చింది. 2027 నాటికి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని డీజిల్‌ బస్సులను 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులతో భర్తీ చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడం, క్లీన్‌ & గ్రీన్‌ ప్రజా రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కొనసాగుతోందని పేర్కొంది.

ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఆరు డిపోలలో 265 ఈ-బస్సులు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం మరిన్ని 275 ఈ-బస్సులు చేరనున్నాయి. అలాగే ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుతోపాటు 19 డిపోలలో ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. రూ.392 కోట్ల వ్యయంతో 10 కొత్త డిపోలు, ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *