కారు జస్ట్ సర్వీసింగ్ కు వెళ్ళింది:కేటీఆర్

కేటీఆర్:కారు జస్ట్
సర్వీసింగ్ కు వెళ్ళింది

అచ్చంపేట, ఫిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : 24 ఏళ్లు వంద కిలోమీటర్ల వేగంతో జోరుగా వెళ్లిన కారు ఇప్పుడు కేవలం సర్వీసుకు మాత్రమే వెళ్లిందని, మళ్లీ తిరిగి వస్తుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్​ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలుపెట్టిందని విమర్శించారు. అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్​ఎస్​ నాగర్​కర్నూల్​ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్​ పాల్గొని కాంగ్రెస్​ పార్టీని తీవ్రంగా విమర్శించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు ఏ విధంగా సన్నద్ధం కావాలో దిశానిర్దేశం చేశారు. కేసీఆర్​పై​, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షల మంది ఉన్నారని కేటీఆర్​ తెలిపారు.

పదవులు రాలేదని నాయకులకు ఉండొచ్చు కానీ కార్యకర్తలకు లేదని పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకులు ఏడాదిపాటు కాపాడుకోవాలని కోరారు. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నాయకులను కాపాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ నమ్మబలికారని మండిపడ్డారు. పదేళ్లయినా పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కర్ణాటకలో అప్పర్​భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు.

కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్​ కేఆర్​ఎంబీకి అప్పగించిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ నేతలు కృష్ణా నదిపై ప్రాజెక్టులను దిల్లీ చేతిలో పెట్టారని ఆరోపించారు. ఎండాకాలం రాకముందే మంచినీళ్ల సమస్య మొదలైందని అన్నారు. ఎక్కడ కోల్పోతే తిరిగి అక్కడే సాధించుకోవాలన్న కేటీఆర్, అందుకే అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్​ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని, అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్​ తెలిపారు. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు ఎదురు చూశాడట. మేము కూడా అట్లే అనుకున్నాము.

కాంగ్రెస్​ వాళ్లు వంద తప్పులు చేసేదాకా ఆగుదాం. వంద రోజులు ఆగుదాం అని. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పథకాల్లో ఒక్కొక్కటికీ ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోంది. కేవలం గులాబీ కండువా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది. ఈ గులాబీ జెండా ఒక్కటే గల్లీ నుంచి దిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది. పార్లమెంటు, అసెంబ్లీలో తెలంగాణ కోసం కొట్లాడాలంటే కేవలం బీఆర్​ఎస్​తోనే సాధ్యం. ఎక్కడ కోల్పోయేమో అక్కడి తిరిగి సాధించుకుందాం. అచ్చంపేట నుంచే అది మొదలు పెడదాం అని కేటీఆర్​ అన్నారు.

కేటీఆర్​ను అడ్డుకున్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు
అచ్చంపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్​ హాలులో నిర్వహించిన సభలో కేటీఆర్​ను అడ్డుకోవడానికి అంతకుముందు ఎన్​ఎస్ యూఐ కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. గత పదేళ్లలో అచ్చంపేటకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు కేటీఆర్​ పర్యటనను అడ్డుకుంటామని ఎన్​.ఎస్​.యూ.ఐ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు కేటీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చంపేట మండలం చెన్నారం సమీపంలో నిరసనలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *