వందేళ్లు వర్ధిల్లే-ఉప్పల్ స్కైవాక్

  • పాదచారులకు రక్షణ…
    ఆకాశ వంతెన
  • దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఉప్పల్ బోర్డ్ వాక్
  • అందుబాటులో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు
  • ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెయిల్, విశాఖ స్టీల్ లతోపాటు జిందాల్ స్టీల్ వినియోగం
  • మంత్రి కేటీఆర్ ఆలోచనల్లో పురుడు పోసుకున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురానున్నది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి.

రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది. ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడకంతో పూర్తి చేశారు.

పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ కు సూచించారు.

ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి ఉప్పల్ సర్కిల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. వారు రూపొందించిన కొన్ని నమూనాల నుంచి ప్రస్తుత పాదచారుల వంతెన డిజైను ఎంపిక చేసి దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండిఏకు అప్పగించారు.

ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పాదచారుల వంతెన( స్కైవాక్ లేదా బోర్డ్ వాక్) నిర్మాణం శ్రేయస్కారమని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే పాదచారుల వంతెన ప్రాజెక్టు పనుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు అప్పగించింది.

సుదీర్ఘకాలం మన్నికకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించడం జరిగింది.

పాదచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది.

మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్) బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు.

వాస్తవానికి 2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా జాప్యం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో 90 శాతం మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండడం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు జరగలేదు.

ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు అటు ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది.

ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సాధారణం సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. ఇకపైన ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణీకులు మెట్రో కాన్ కోర్ (ఫ్లోర్) నుంచి పాదచారుల వంతెన (స్కై వాక్) మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాలవైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.

లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలు పచ్చిక బయలతో పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *