శతాధిక వత్సరాలు చల్లగా వర్ధిల్లు బాపూ…

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విశ్వం న్యూస్) : “కేసీయార్ “ అనే మహా
వటవృక్ష ఛ్ఛాయలలో
వ్రేళ్ళూనిన తెలగాణం..
విలసిల్లిన మాగాణం…
ఉద్యమాలు ఊపిరులై
నినాదాలు గొంతుకలై
“చావో- రేవో” వాక్యం
సాధనకాయెను మంత్రం..
ఒఱ్ఱెలు బారిన నేలన
ఉరికిన గోదావరులు..
ఎండిన చెరువుల కడుపున
నిండిన కృష్ణాజలాలు..
పండిన పొలాలు, చెలకలు
దండిగ నిండుగ గరిసెలు…

మా బాపూ మఱ్ఱి మాను..
మహావృక్షమైన తాను
నీడనిచ్చి., నేల జీల్చి
ఊడలు పాతిన వైఖరి..
తరతరాల ఘన చరితకు
బీజం వేసిన మాదిరి..
పలుకు పత్రహరితమై
చిగురించెను భాగ్య రేఖ
భావన దృఢ కాండమై
ఎగిరించెను జయ పతాక…

నవనవోన్మేష భావ
నవజీవన చైతన్యం
బాపు దార్శనికత కు
ప్రత్యక్ష నిదర్శనం..
నింగినంటు ఔన్నత్యం
విశాలమౌ సాంగత్యం
మొక్కవోని ధైర్యానికి
ప్రతీకగా అభినివేశం..
ఆలోచన, అనుశాసన,
ఆవేదన, అభినందన
అణగారిన వర్గాల
అభివృద్ధి , చిత్తశుద్ధి
ఆప్యాయత మిళితమైన
ఆలింగన తో స్వాంతన…
మూర్తీభవించిన
వ్యక్తిత్వం మన బాపూ..
చెరిగిపోదు.. తరిగిపోదు
శిరోధార్యమైన చరిత
మాసిపోదు మలిగి పోదు
మహానుభావుని ఘనత…

రైతు బాంధవుడు “బాపు”
కర్షక కార్మికుల “ప్రాపు”
సకల జీవరాశులకు
స్వస్థత, సంరక్షణ…
వటవృక్షం ఆలంబన
తరులతలకు ఆచ్ఛాదన…
బాపూ ఒక భాస్కరుడై
ప్రసరించిన కిరణాల
కాంతిపుంజమే జనతకు
క్రాంతి ప్రభంజనం..
మన బాపు జన్మదినం
ఘన సంస్కృతి పర్వదినం..
మూడు మొక్కల వృక్షార్చన
ముచ్చటైన ఆలోచన
పర్యావరణ పరిరక్షణ
పచ్చదనానికి సూచన..

కలకాలం ఈ పండుగ
విలసిల్లును కనువిందుగ…

శతాధిక వత్సరాలు
చల్లగ వర్ధిల్లమని
బాపూనభిమానించే
ప్రతి మనుజుని భావన
సబ్బండ వర్గాల ఏక గళ స్పందన..
సర్వేశ్వరుడొసగే సన్మంగళాశాసన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *