మేడ్చల్, మార్చి 2 (విశ్వం న్యూస్) : మేడ్చల్ కలెక్టరు ఆదేశాలు మరియు HMDA అధికారుల సూచనల తో గుండ్లపోచంపల్లి మునిసిపల్ అధికారులు బి.ఆర్.ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి బిగ్ షాకిచ్చారు.
మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్ హెచ్.ఎం.డి.ఏ లే అవుట్లో ఉన్న ప్రభుత్వ పార్క్ పది గుంటల స్ధలం సుమారు (1250 గజాల స్థలాన్ని) తమ కాలేజ్ వెనుక వైపు నుండి రహదారి కలసి వస్తుంది అని ఆక్రమించి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు..కళాశాల కు వెల్లే రహదారి ని మూసివేశారు.
- తాజాగా.. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తోందన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామన్నారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య, విద్యార్థుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.