₹3.30 లక్షల కోట్లు కాదు…
₹1.67 లక్షల కోట్లే చెల్లింపు

హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల చెల్లింపులపై చేసిన ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చెల్లించిన అప్పుల గణాంకాలను భారీగా పెంచి చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అప్పులు తీసుకుని చెల్లించిందని ముఖ్యమంత్రి పదేపదే ప్రకటిస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన సోషియో ఎకనామిక్ సర్వే నివేదికలో ఉన్న గణాంకాలు ఆ ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం FRBM లోన్ల కింద చెల్లించిన మొత్తం ప్రిన్సిపల్ మరియు వడ్డీ కలిపి సుమారు ₹1,67,742 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన ప్రభుత్వం ₹3,30,570 కోట్లు అప్పులు తీర్చిందని చెప్పడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రకటన అని విమర్శించారు.
ఫైనాన్స్ శాఖ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు అప్పుల చెల్లింపులను నాలుగు విభాగాలుగా చూపించారని చెప్పారు. ఇందులో FRBM లోన్ల కింద ప్రిన్సిపల్ ₹40,660 కోట్లు, వడ్డీ ₹56,350 కోట్లు కలిపి మొత్తం ₹97,010 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
అలాగే ప్రభుత్వ గ్యారంటీతో ప్రత్యేక ప్రయోజన వాహనాలు (SPVs) తీసుకున్న లోన్లలో ప్రిన్సిపల్ ₹47,043 కోట్లు, వడ్డీ ₹23,689 కోట్లు కలిపి మొత్తం ₹70,732 కోట్లు ప్రభుత్వం సర్వీస్ చేసిందని తెలిపారు.
ఈ రెండు విభాగాలు కలిపి ప్రభుత్వం ప్రత్యక్షంగా చెల్లించిన మొత్తం ₹1,67,742 కోట్లు మాత్రమేనని చెప్పారు. కానీ మిగతా రెండు విభాగాల్లో ఉన్న అప్పులను సంబంధిత సంస్థలు తమ స్వంత ఆదాయాలతో చెల్లించినప్పటికీ వాటినీ ప్రభుత్వమే చెల్లించినట్లు చూపిస్తూ మొత్తం సంఖ్యను పెంచి ప్రకటించడం జరిగిందని విమర్శించారు. SPVs స్వయంగా చెల్లించిన అప్పులు ₹1,02,744 కోట్లు కాగా, కార్పొరేషన్లు చెల్లించిన నాన్-గ్యారంటీ లోన్లు ₹33,717 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు కలిపి ₹1,36,461 కోట్ల అప్పులకూ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం “గ్రాండ్ క్రెడిట్ దొంగతనం” అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ అనే ప్రజాస్వామ్య వేదికపై తప్పుడు ఆర్థిక గణాంకాలను వినిపించడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.