బండి సంజయ్
దిష్టిబొమ్మ దహనం

- నాగారం మండల
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
నాగారం, మార్చి 17 (విశ్వం న్యూస్): తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ హైదరాబాద్‌లోని నివాసంపై కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేసిన ఘటనపై నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బీజేపీ, బీజేవైఎం నాయకులపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని ఫణిగిరి స్టేజ్ వద్ద కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం నాగారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగూరి బిక్షం మాట్లాడుతూ, ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా వక్రీకరించి బీజేపీ నాయకులు పరిస్థితిని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తన మాటలను వెనక్కి తీసుకున్నప్పటికీ దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు.
దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి వెంకట్ రెడ్డి, మూల ప్రసాద్, కర్నాటి అంజయ్య, బుడిగే పవన్, గోడదాటి సైదులు, బొట్టు సురేష్, వంగూరి కుమార్, ఎల్లి సోమన్న, బూడిద గణేష్, వంగూరి మహేష్, పర్రేపాటి వెంకటేష్, బొట్టు మహేష్ తదితరులు పాల్గొన్నారు.