‘ఓటుకు నోటు’ కేసు తుడిచే కుట్ర అనుమానం:దాసోజు

హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2026 (విశ్వం న్యూస్) : ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికమని ప్రభుత్వం చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ‘ఓటుకు నోటు’ వంటి అత్యంత కీలక కేసులకు సంబంధించిన ఫైళ్లు ఉన్న విభాగంలోనే షార్ట్ సర్క్యూట్ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది సాక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించిన పక్కా స్కెచ్ అన్న అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు.
డిజిటల్ యుగంలో డేటా బ్యాకప్ లేకుండా కంప్యూటర్లు కాలిపోయాయని చెప్పడం నమ్మశక్యం కాదని, కీలక సాక్ష్యాలను కావాలనే బూడిద చేసిన వ్యవస్థీకృత కుట్రకు ఇది సంకేతమని వ్యాఖ్యానించారు. అత్యంత భద్రత ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరపాలని, క్లౌడ్ బ్యాకప్ నుంచి డేటాను రికవర్ చేసి ఏ ఫైళ్లు సురక్షితంగా ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని, భద్రతా లోపాలకు బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.