ట్రాఫిక్ చలాన్ల ఆటో–డెబిట్పై రాజ్యాంగ ముప్పు

హైదరాబాద్, జనవరి 13, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ట్రాఫిక్ చలాన్ల ఆటో–డెబిట్ విధానం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా చలాన్లను వసూలు చేయాలన్న ఈ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, మౌలిక హక్కులపై ప్రత్యక్ష దాడిగా మారుతుందని న్యాయ నిపుణులు, పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రాఫిక్ చలాన్ అనేది నేర నిర్ధారణ కాదని, అది కేవలం ఒక ఆరోపణ నోటీసు మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. చలాన్ అందుకున్న ప్రతి పౌరుడికి వివరణ ఇచ్చే, అప్పీల్ చేసుకునే, కోర్టును ఆశ్రయించే హక్కులు చట్టం కల్పించింది. ఆటో–డెబిట్ విధానం అమలైతే నేరం రుజువు కాకముందే శిక్ష విధించినట్టవుతుందని విమర్శిస్తున్నారు.
ఈ ప్రతిపాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవన హక్కు), ఆర్టికల్ 300A (ఆస్తి హక్కు)లకు విరుద్ధమని పేర్కొంటున్నారు. బ్యాంకు ఖాతాలోని డబ్బు వ్యక్తిగత ఆస్తి కాగా, కోర్టు ఆదేశం లేకుండా ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదేవిధంగా, RBI నిబంధనలు మరియు బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాదారుడి స్పష్టమైన అనుమతి లేకుండా డెబిట్ చేయడం అక్రమమని, బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం అమలైతే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ప్రకారం గోప్యత మౌలిక హక్కు అని గుర్తు చేస్తూ, ట్రాఫిక్ చలాన్ల పేరిట బ్యాంకు ఖాతా వివరాల వినియోగం అనవసర జోక్యంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 200 ప్రకారం చలాన్ చెల్లించాలా లేక కోర్టుకు వెళ్లాలా అన్న ఎంపిక హక్కు పౌరుడిదేనని, ఆటో–డెబిట్ ఈ హక్కును హరిస్తుందని విమర్శిస్తున్నారు.
ప్రజల సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం వసూళ్ల యంత్రాంగంగా మారకూడదని, ట్రాఫిక్ చలాన్ల పేరుతో ఆటో–డెబిట్ అమలైతే అది “లైసెన్స్డ్ ఎక్స్టోర్షన్”గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య మరియు చట్టబద్ధమైన విధానాలనే అనుసరించాలని డిమాండ్ చేస్తున్నారు.