అసత్య ఆరోపణలపై కార్పొరేటర్ అంజన్ కుమార్ ఆగ్రహం

అసత్య ఆరోపణలపై కార్పొరేటర్ అంజన్ కుమార్ ఆగ్రహం

కరీంనగర్, మార్చి 28 (విశ్వం న్యూస్) : పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా… ఈ రోజుల్లో అవినీతి పరులే నీతిమంతులుగా మాట్లాడటం చాలా విచిత్రం” అంటూ 26వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.

యూఐడిఎఫ్ నిధుల టెండర్లు రద్దు అయ్యాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును ప్రస్తావిస్తూ అనవసర ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.

సంబంధిత నిధులు, టెండర్ల విషయంలో మంత్రి ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ… టెండర్లు రద్దు చేయమని ఎక్కడా మంత్రి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. కొత్తగా విలీనం అయిన గ్రామాల అభివృద్ధి కోసం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మాత్రమే మంత్రి సూచించారని పేర్కొన్నారు.

అభివృద్ధి కోసం కార్పొరేటర్లు తమ డివిజన్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని సూచనలు చేశారని వెల్లడించారు. అయితే, కొందరు కావాలనే రాద్ధాంతం సృష్టిస్తూ మంత్రి పేరును లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మేయర్ రవీంధర్ సింగ్ తన ప్రవర్తన మార్చుకోవాలని, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించబోమని గట్టిగా హెచ్చరించారు. మేయర్ ఎన్నికల సమయంలో ఆయన పోషించిన పాత్ర నగర ప్రజలకు తెలిసిందేనని, బీజేపీతో కుమ్మక్కయ్యారనే చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు.

“సైలెంట్ రాజకీయాలు ప్రజలకు బాగా తెలుసు… ఇప్పుడు నీతులు మాట్లాడటం సిగ్గుచేటు” అంటూ వైద్యుల అంజన్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *