క్రషర్ తారు ప్లాంట్ కాలుష్యం – ప్రజల ఆందోళన

క్రషర్ తారు ప్లాంట్ కాలుష్యం – ప్రజల ఆందోళన

నాగారం, మార్చి 13 (విశ్వం న్యూస్): నాగారం మండల పరిధిలో పనిచేస్తున్న క్రషర్ తారు ప్లాంట్ నుండి భారీగా పొగ, దుమ్ము, విషవాయువులు ఎగిసిపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పర్యావరణ నిబంధనలు పట్టించుకోకుండా ప్లాంట్‌ను నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్లాంట్ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ముతో రహదారి మొత్తం కమ్మిపోవడంతో వాహనదారులకు దారి కనిపించక ప్రమాదాల భయం నెలకొంది.

ఇక ప్లాంట్ నుంచి వచ్చే దుమ్ము సమీపంలోని రైతుల పొలాలపై పడుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడులు తగ్గిపోతాయని వారు చెబుతున్నారు.

గతంలో ఇదే ప్లాంట్‌కు చెందిన వాహనం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నిలిపివేయడంతో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. అయినప్పటికీ ప్లాంట్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.

ఈ పరిస్థితులకు కారణం గ్రామపంచాయతీ నిర్లక్ష్యమా? లేక కాలుష్య నియంత్రణ శాఖ నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. క్రషర్ తారు ప్లాంట్ వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే అధికారులు స్పందించి ప్లాంట్‌పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *