పెరుగుతున్న వెద వరి సాగు పద్ధతి
- పెరుగుతున్న వెద వరి సాగు పద్ధతి
నల్గొండ, జూలై 6 (విశ్వం న్యూస్) : తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆహార పంట అయిన వరిని సాంప్రదాయ పద్ధతిలో అనేక సంవత్సరాలుగా నాటే పద్ధతిని అనుసరిస్తున్నాము. గత కొంత కాలంగా సరైన సమయానికి వర్షాలు పడక పోవడం నాటేయడానికి కూలీలు దొరక్కపోవడం దొరికిన కానీ నాటేయడానికి కూలీ ఖర్చులు గిట్టుబాటు కాక పోవడం. ఇలా కొన్ని కారణాల చేత తెలుగు రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో ఇప్పటికే వెద పద్ధతిలో వరి సాగు చేస్తూ పెట్టుబడుల్లో కొంత తగ్గుదల చేసి అధిక నికర ఆదాయాన్ని కొంత మంది రైతులు పొందుతున్నారు.
అందు చేత వీలైనంత వరకు ఈ పద్ధతిని అవలంబించి అధిక ఉత్పాదకత మరియు నికర ఆదాయాన్ని పొందాలి అంటే వెద పద్ధతిలో ఏ విధంగా వరిసాగు చేయాలో ఆ సాగు మెళకువల గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం .
వెద పద్ధతిలో నేలను 2 విధాలుగా సిద్ధం చేసుకోవచ్చు
1 పొడి దుక్కి
2 తడి దుక్కి
1 పొడి దుక్కి : వేసవి లో రెండు లేదా మూడు సార్లు నేలను దున్ని గుల్ల బారేట్లుగా చేసుకోవాలి గట్ల పై ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి . దున్నడానికి డిస్క్ నాగలి లేదా కల్టివేటర్ ను వాడ వచ్చు పొలం మొత్తం చదునుగా చేసుకోవాలి.
ఇలా సిద్ధం చేసుకున్న పొలంలో లావు రకం విత్తనమైతే ఎకరానికి 12 నుండి 15 కిలోగ్రాముల విత్తనం మరియు సన్న రకం విత్తనం అయినచో 10 నుండి 12 కిలో గ్రాముల విత్తనం వాడాలి. క్రిమి సంహారక మరియు శిలీంధ్ర నాశక మందులతో విత్తన శుద్ధి చేసుకొని పొలంలో సమానంగా వెద జల్లాలి . సన్నని ఇసుకతో 1:1నిష్పత్తితో కలుపుకొని చల్లినచొ విత్తనం సమానంగా పడుతుంది . చల్లిన తరవాత HARROW తో గాని ROTAVATOR తో గాని పైన ఉండే మట్టి 1 లేదా 2 అంగుళాల మేర కదిలేలా దున్ను కోవాలి. ఆ తర్వాత నీరు పెట్టాలి (వర్షాధారంగా కూడా మొలకెత్తుతుంది). 6 లేదా 7 గంటలు మడిలో నీరు ఉంచి ఆ తరవాత నీరు తీసివేయాలి. మడిలో ఎక్కడైనా నీరు నిలిచి ఉన్నట్లయితే చిన్న కాలువల ద్వారా బయటకు తీసివేయాలి 2 లేదా 3 రోజుల్లో మొలక బయటకు కనిపిస్తుంది.
2 తడి దుక్కి: వేసవి లో 2 లేదా 3 దుక్కులు అయిన తరవాత మడులను నీటితో నింపి రోటవేటర్తో గాని ఇనుప చక్రాలు ( కేజ్ వీల్స్ ) తో దమ్ము చేసి గొర్రు తో చదును చెయ్యాలి. ఇప్పుడు విత్తనం వెద జల్లడానికి మడి సిద్ధమైనది. ఒక రోజు పాటు నీటిలో నాన పెట్టిన విత్తనాన్ని ఒక గంట పాటు మామూలు సూర్య రశ్మిలో ఎండ పెట్టి . మరో 12 నుండి 18 గంటల పాటు పరదాలతోగాని ఎండు గడ్డి తో గాని కప్పి వుంచాలి తదనంతరం తెల్లని మొలక కనిపిస్తుంది ఈ మొలకను నీళ్లతో నింపి దమ్ము చేసిన మడిలో చల్లుకోవాలి . చల్లిన తరవాత 5 లేదా 6 గంటల అనంతరం మడుల నుండి నీటిని తీసి వెయ్యాలి.
పొడి పద్ధతి, తడి పద్ధతి ఈ రెండింటి లో 2 నుండి 3 రోజులలో నారు మొక్క కనపడుతుంది . పైరు 15 నుండి 20 రోజుల వయస్సు వచ్చే వరకు భూమిలో తేమ వుండేట్లుగా నీటి తడి ఇవ్వాలి ప్రతి నాలుగు రోజులకి ఒక తడి ఇవ్వాలి. సంప్రదాయ వరి పద్ధతిలో కన్నా వెద పద్ధతిలో కలుపు అధికంగా ఉంటుంది . కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి కలుపు మందులు వాడాలి. కలుపు మొక్కలు 3-4 పత్రాల దశలో ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చెయ్యాలి.
(గమనిక:కలుపు మందు వాడే ముందు రోజు మడి లో నీరు పెట్టి తీసి వెయ్యాలి నేల బురదగా తేమతో ఉండాలి) మార్కెట్ లో ప్రస్తుతం విరివిగా లభ్యం అవుతున్న కలుపు మందులు వాటి పేర్లను వాడే మోతాదు ను క్రింద పట్టిక లో క్లుప్తంగా తెలిపాము పరిశీలించగలరు.
పైన తెలుపబడిన ఏదైనా ఒక గడ్డి మందు లేదా మిశ్రమ మందును పైరు 15 -20 రోజుల వయసు వచ్చాక స్ప్రే చెయ్యాలి స్ప్రే చేసిన 3 రోజుల అనంతరం మడిలో నీరు పెట్టాలి (1 లేదా 2 అంగుళాల మేరకు మొక్క ఎత్తును బట్టి ). కలుపు మందు స్ప్రే చేసిన 5 రోజుల తరవాత మొదటి దఫా ఎరువు అందించాలి. కాంప్లెక్స్ ఎరువు 30 నుండి 40kg+15-20kgల యూరియా+10-15kg ల MOP వెయ్యాలి.
మొదటి దఫా ఎరువు ఇచ్చిన తరవాత నుండి పొలంలో నీరు పెట్టాలి . ఈ సమయం నుండి నారు నాటే సంప్రదాయ పద్ధతి లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అవే ఈ పద్ధతిలో పాటించాలి.
Tharunoju Laxman kumar
(Jr Agronomist Avasya resources pvt ltd ,Ghana)
Contact : +919542805396.
Basaraveni Gouthami
( Ph.D scholar,IARI ,New Delhi ),
M.Bhargav Reddy
(Young professional – 2 NAARM ,Rajendra nagar)
Jangam Jeevan
(Jr Agronomist Avasya resources pvt ltd ,Ghana)