
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారిన పరిణామం ఇది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవికీ విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం, ఆమెపై పార్టీ విధించిన సస్పెన్షన్‌కు నెక్స్ట్ డేలోనే చోటు చేసుకుంది.
తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
“నాన్న..! అన్నా..! హరీష్ రావు, సంతోష్ రావులను నమ్మకండి. వాళ్లు మన కుటుంబ మేలుకంటే, తమ స్వార్థాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ ప్రజల మేలు వాళ్లకు అసలే పట్టదు,” అని ఆమె ఘాటు విమర్శలు చేశారు. “రెవంత్ రెడ్డితో వాళ్లకు సంబంధాలు ఉన్నాయ్”
ఆమె ఆరోపణల ప్రకారం, హరీష్ రావు మరియు సంతోష్ రావులు కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుత సీఎం రెవంత్ రెడ్డితో గాఢ సంబంధాలు కలిగి ఉన్నారని, పార్టీని లోపల నుంచి బలహీనపరచే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు.”ఇప్పుడు నన్ను పార్టీ నుంచి పంపించారు. రేపు రామన్నను పంపిస్తారు… తర్వాత మిమ్మల్నీ పంపిస్తారు నాన్న! దయచేసి అర్థం చేసుకోండి!” అంటూ తన బాధను వ్యక్తం చేశారు.
కవిత తన భవిష్య రాజకీయ ప్రణాళికపై స్పష్టత ఇవ్వకపోయినా, త్వరలో దానిని ప్రకటిస్తానని తెలిపారు. “తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. త్వరలో నా భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తాను,” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆమె స్వతంత్ర రాజకీయ ప్రస్థానం లేదా కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేయవచ్చన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.