హిమాయత్‌సాగర్ పరిధిలో అక్రమ మైనింగ్… సహజ వనరుల దోపిడీపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్): ముఖ్యమంత్రి బంధువులు బినామీల పేర్లతో సహజ వనరులను దోచుకుంటూ అక్రమ మైనింగ్, క్రషింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని హిమాయత్‌సాగర్ పరిధిలో జరుగుతున్న ఈ అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ బుధవారం ఉదయం కొకాపేట్ సమీపంలోని నియోపోలిస్ ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌ను సందర్శించి పరిశీలించింది.
ఈ క్రషింగ్ యూనిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులకు సంబంధించినదిగా ఆరోపణలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు అక్కడ జరుగుతున్న పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.

ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ డా. మన్నె క్రిషాంక్, తెలంగాణ వైల్డ్‌లైఫ్ బోర్డు మాజీ సభ్యుడు ఎస్. రాఘవేందర్, ఫైనాన్స్ కమిషన్ మాజీ సభ్యుడు జి. శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఇటీవల మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన బినామీల పేర్లతో నడుస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషింగ్ యూనిట్‌ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టామని గుర్తు చేశారు. అక్కడి పరిస్థితులు ‘కేజీఎఫ్’ సినిమా సన్నివేశాలను తలపించాయని, ఇప్పుడు నియోపోలిస్ ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు దానికంటే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషింగ్ యూనిట్‌కు ముఖ్యమంత్రి అనుమతి తప్ప ఇతర శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ యూనిట్‌లో భారీ స్థాయిలో క్రషింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా నెలకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోందని, ఆ మొత్తం ముఖ్యమంత్రి బంధువుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు.

జీవో 111 పరిధిలో సాధారణ ప్రజలు చిన్న ఇల్లు కూడా నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వని అధికారులు, అదే ప్రాంతంలో 17 ఎకరాల్లో భారీగా క్రషింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారులు పాలకులతో కుమ్మక్కయ్యారా అని నిలదీశారు.
మూడు ఆధునిక క్రషర్లతో గుట్టలను కొల్లగొడుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), మైనింగ్ శాఖలు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

పదిహేడు ఎకరాల భూమిని నామినేషన్ పద్ధతిలో ఎలా కేటాయించారని ప్రశ్నించిన ఆయన, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ క్రషింగ్ యూనిట్ నుంచి తీసిన కంకరనే చుట్టుపక్కల నిర్మాణాలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఫత్వా జారీ చేశారనే సమాచారం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, ఈ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదిస్తామని హెచ్చరించారు.