తెలంగాణపై విమర్శలు ఆపాలని దాసోజు శ్రవణ్ హెచ్చరిక

  • తెలంగాణపై విమర్శలు ఆపాలని దాసోజు శ్రవణ్ హెచ్చరిక
  • టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం
  • ప్రత్యేక హోదా సాధించలేక తెలంగాణపై విమర్శలంటూ ఆరోపణ
  • పార్లమెంట్ సాక్షిగా చర్చకు సిద్ధమని సవాల్
  • తెలంగాణ ఎంపీల మౌనంపై తీవ్ర విమర్శలు

హైదరాబాద్, మార్చి 10 (విశ్వం న్యూస్) : రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు గడిచినా ఇంకా తెలంగాణపై విమర్శలు చేస్తూ విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరుపై బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. లోక్‌సభ వేదికగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్‌ల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

“కోతి పుండు” రాజకీయాలు మానండి: తెలుగుదేశం నేతల వైఖరి “కోతికి పుండు అయితే గోకినట్టు.. నాకినట్టు” మారిందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టకుండా, నిరంతరం తెలంగాణపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన కుట్రలు ఎవరివో ప్రజలకు తెలుసని అన్నారు.

అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమా?: సొంత రాష్ట్రంలో పాలన సరిగా చేయలేక ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయ సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించలేకపోయిన తమ వైఫల్యాన్ని దాచిపెట్టడానికి తెలంగాణపై విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారిక వైఖరా? లేక ఆ ఎంపీల వ్యక్తిగత అభిప్రాయమా అని ఆయన నిలదీశారు.

దమ్ముంటే చర్చకు రండి : పాత గాయాలను మళ్లీ రేపే ప్రయత్నాలు చేస్తే తాము ఊరుకోబోమని శ్రవణ్ హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత టీడీపీ అడ్డంకులపై, కృష్ణా జలాల పంపిణీపై, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు.

తెలంగాణ ఎంపీల మౌనంపై ఆగ్రహం : పార్లమెంట్‌లో తెలంగాణపై వ్యాఖ్యలు చేసినప్పటికీ తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని శ్రవణ్ తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలకు వెంటనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందని పేర్కొన్నారు.

ఖబడ్దార్.. తస్మాత్ జాగ్రత్త : ప్రాంతాలుగా విడిపోయినా రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చు పెట్టొద్దని శ్రవణ్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *