ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాసోజు బహిరంగ లేఖ

  • బూతు భాషతో ప్రజాస్వామ్యంపై దాడి- ముఖ్యమంత్రి స్థాయికే మచ్చ తెచ్చే రేవంత్ రెడ్డి వాఖ్యలు: డా. శ్రవణ్ దాసోజు ఘాటు విమర్శ

హైదరాబాద్, డిసెంబర్ 27 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజా వేదికలపై ఉపయోగిస్తున్న అసభ్య, హింసాత్మక భాష తెలంగాణ ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య మర్యాదలు, ముఖ్యమంత్రి హోదాకు అవసరమైన సంస్కారాన్ని విస్మరించి మాట్లాడటం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజాసేవకులను అవమానించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాల్సిన నాయకుడు బెదిరింపుల భాషను ప్రదర్శించడం ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తోందన్నారు. ప్రజల చేతిలో అధికారాన్ని ఉంచే రాజ్యాంగ భావనకు ఇది విరుద్ధమని స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు రాజకీయ విమర్శల హద్దులు దాటాయని డా. శ్రవణ్ దాసోజు అన్నారు. అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన చోట అసభ్య పదజాలం వాడటం పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, అటువంటి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి భాషలో సంస్కారం ఉండాలని ఆయన హితవు పలికారు. ప్రజల ఓటుతో వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, హుందాతనం, బాధ్యతతో పాలన సాగించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో మాటలకే కాదు, మాటల వెనుక ఉన్న విలువలకే ప్రాధాన్యం ఉంటుందని, సీఎం తన ప్రవర్తనను వెంటనే సరిదిద్దుకోకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని డా. శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *