ప్రియుడి కోసం తల్లిని హతమార్చిన కూతురు

- బైక్ అమ్మేందుకు వెళ్లడంతో బయటపడిన హత్య రహసం
హైదరాబాద్, మార్చి 25 (విశ్వం న్యూస్):మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఏడాది క్రితం కనిపించకుండా పోయిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి ప్రేమకు అడ్డుగా నిలిచిందనే కారణంతో చిన్న కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన తాజాగా బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2025 మే నెలలో మంజు అనే మహిళ కనిపించకుండా పోయిందని ఆమె పెద్ద కూతురు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి మాత్రమే కాకుండా ఆమె బైక్ కూడా కనిపించడం లేదని తెలిపింది. దీంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మంజు ఆచూకీ కనుగొనలేకపోయారు.
అయితే ఇటీవల మంజుకు చెందిన బైక్‌ను రాంకోఠిలోని ఒక షాపులో అమ్మేందుకు మౌంటీ రాజ్‌పుత్ అనే వ్యక్తి వెళ్లాడు. బైక్ విషయంలో అతను చెప్పిన వివరాలు అనుమానాస్పదంగా ఉండటంతో షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రాజ్‌పుత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు బయటపడ్డాయి.
రాజ్‌పుత్ తెలిపిన ప్రకారం, మంజు చిన్న కూతురు ఇషికాతో తనకు ప్రేమ సంబంధం ఉందని, తమ ప్రేమకు మంజు అడ్డుగా నిలిచిందని తెలిపాడు. దీంతో ఇద్దరూ కలిసి మంజును హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి, ఏమీ తెలియనట్లు ఇషికా ఏడాది కాలంగా నటించినట్లు వెల్లడైంది.
కేసును నమోదు చేసిన పోలీసులు ఇషికా, రాజ్‌పుత్‌లను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.