
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య మలుపు
- ఇప్పటికే ఆప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు
- ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డి
- అప్రూవర్ గా మారుతా అని సి.బి.ఐ ప్రత్యేక కోర్టును అనుమతి కోరిన శరత్ చంద్రారెడ్డి
- శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను అంగీకరించిన సి.బి.ఐ ప్రత్యేక కోర్టు
ఢిల్లీ, జూన్ 1 (విశ్వం న్యూస్) : దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకమైన వ్యక్తి, సౌత్‌గ్రూప్‌లో ముఖ్య సభ్యుడైన శరత్‌చంద్రారెడ్డి తాను అప్రూవర్‌గా మారుతున్నట్లు.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ దిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనుమతులు మంజూరు చేయటంతో పాటు దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లేలా ఈడీకి నోటీసులు జారీ చేసింది.
ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు ముడుపులు అందాయని.. వీటిలో రూ.30 కోట్లు హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దిల్లీకి చేరాయని, మిగతా రూ.70 కోట్లు దిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నట్లు.. దీంతో పాటు దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సీబీఐ, ఈడీలు తెలిపాయి.
శరత్ చంద్రారెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన సమయంలోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక కీలకమైన విషయాలను ప్రస్తావించింది. నిబంధనలను పక్కనబెట్టి సౌత్‌గ్రూప్‌గా ఏర్పడి, ప్రధానమైన ప్రాంతాల్లో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌ను దక్కించుకున్నట్లుగా ఈడీ ఆరోపించింది. అదే సమయంలో సీబీఐ సైతం విధాన రూపకల్పనలోనే అనేక మార్పులు చేర్పులు చేసినట్లు, హైదరాబాద్, దిల్లీలో జరిగిన సమావేశాలతో పాటు కేజ్రీవాల్ నివాసంలో జరిగిన భేటీల్లో వీటిపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు.. వీటన్నింటిలోనూ శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి.