రక్తంతో రాసిన లేఖతో గెజిటెడ్ హోదా డిమాండ్

రక్తంతో రాసిన లేఖతో
గెజిటెడ్ హోదా డిమాండ్

  • రక్తంతో లేఖలు… ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కోరుతూ ముజాహిద్ విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 23 (విశ్వం న్యూస్): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లకు (ఏసీటీఓ) గెజిటెడ్ హోదా కల్పించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రక్తంతో లేఖలు రాసి ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు లకు ఈ లేఖలను పంపినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, 23-02-2017న తన ఆధ్వర్యంలో అప్పటి వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఏ. అనిల్ కుమార్ లకు ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరిధిలో డిప్యూటీ తహసీల్దార్, ఎస్టీఓ, సబ్ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, వెహికల్ ఇన్‌స్పెక్టర్ లతో పాటు ఏసీటీఓ పోస్టు కూడా ఉన్నప్పటికీ, మిగతా అన్ని శాఖల అధికారులు గెజిటెడ్ హోదా పొందగా ఏసీటీఓలు మాత్రం ఇప్పటికీ ఆ హోదా లేకుండా ఉన్నారని అన్నారు.

గత పది సంవత్సరాలుగా టీసీటీఎన్‌జీవో సంఘం పక్షాన ఈ అంశంపై నిరంతరం పోరాటం కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి పీఆర్‌సీ కమిషన్ కూడా ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. జీఏడీ, లా మరియు ఆర్థిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ విషయంలో అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసి ఫైల్‌ను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ అంశంపై ఫైల్ వెళ్లినప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రులు దాసరి సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, మజ్లిస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, సీపీఐ శాసనసభ పక్ష నాయకుడు సాంబశివరావు, బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసినట్లు తెలిపారు.

అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడం అన్యాయమని ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ఒక్క పైసా కూడా ఆర్థిక భారం లేకుండా పరిష్కరించగల సమస్య అయినప్పటికీ పదేళ్లుగా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న 537 మంది ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనుకడుగు వేయనని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎక్కడివరకు అయినా పోరాటం కొనసాగిస్తానని ముజాహిద్ హుస్సేన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *