కూల్చి మళ్లీ నిర్మాణాలా? రేవంత్ కట్టే భవనాలకు బఫర్ జోన్ వర్తించదా?: కేటీఆర్

హైదరాబాద్, మార్చి 14 (విశ్వం న్యూస్): బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, అదే ప్రాంతాల్లో ప్రభుత్వం మళ్లీ కొత్త నిర్మాణాలు ఎలా చేపడుతుందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బఫర్ జోన్ నిబంధనలు సాధారణ ప్రజల ఇళ్లకే వర్తిస్తాయా..? లేక ప్రభుత్వం కట్టే భవనాలకు వర్తించవా అని ఆయన నిలదీశారు.
2016–17 సంవత్సరంలో మూసీ నది సుందరీకరణ కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.16,634 కోట్లతో ప్రణాళిక రూపొందించామని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
అయితే ఆ సమయంలో ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చివేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టడం తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కానీ ప్రస్తుతం బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, అదే ప్రాంతాల్లో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని విమర్శించారు.
ప్రజల ఇళ్లను కూల్చే ముందు ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించాలని, బఫర్ జోన్ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలన్నారు. లేదంటే ఇది ప్రజలపై అన్యాయం అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు.