
విశ్వం న్యూస్ / హైదరాబాద్, ఫిబ్రవరి 26: మహాత్మా గాంధీ పేరు చెప్పుకుని తెలంగాణలో పేదల ఇళ్లను కూల్చడం గాంధేయవాదం కాదని, ఇది బుల్డోజర్ రాజకీయమేనని ఎంఎల్సీ డా.దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తూ, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
ముసీ నది తీరాన ₹5,000 కోట్లతో 500 అడుగుల గాంధీ విగ్రహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల సమాధుల మీద స్మారకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఇళ్లు కూల్చడమే ‘తెలంగాణ రైజింగ్’నా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు ‘మొహబ్బత్ కీ దుకాన్’ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
క్రోనీ క్యాపిటలిజం వాసన : గాంధీ కుటుంబం కోసం నిధుల వసూలుపై ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నాయని, గాంధీ భక్తి ముసుగులో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. ఇందులో అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ శక్తుల పేరు వినిపించడం ఆందోళనకరమన్నారు.
“నాకు విగ్రహాలే వద్దు” – బాపూ మాటలు : 1939లో ‘హరిజన్’లో మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, తన పేరు పేదల సేవలో లేకపోతే గుర్తులు కూడా అవసరం లేదన్న భావనకు ఈ ప్రాజెక్ట్ పూర్తి విరుద్ధమని చెప్పారు. గాంధీ బొమ్మ చూపించి పేదవాడిని నిరాశ్రయుడిని చేయడం ఆయన వారసత్వానికి అవమానమన్నారు.
ద్వంద్వ నీతి ఆరోపణ : గుజరాత్‌లో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో గిరిజనుల తరలింపును అప్పట్లో కాంగ్రెస్ తప్పుబట్టిందని గుర్తు చేశారు. అదే విగ్రహ రాజకీయాలు తెలంగాణలో ఎలా సమర్థన పొందుతున్నాయని ప్రశ్నించారు. సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి తగిన గౌరవం ఇవ్వకపోవడం వివక్షకేనని అన్నారు.
గాంధీ మనవడి హెచ్చరిక : గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా “నివాసాలు కూల్చి గాంధీ విగ్రహం పెట్టడం అగాంధేయ చర్య” అంటూ అభ్యంతరం చెప్పారని గుర్తు చేశారు.
ఆర్థిక స్థితిపై ప్రశ్నలు : రుణమాఫీ, హామీల అమలుకు నిధుల్లేవని చెప్పే ప్రభుత్వం, విగ్రహానికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందని నిలదీశారు. ఇది ప్రజాధన దుర్వినియోగమేనన్నారు.
జోక్యం కోరుతూ విజ్ఞప్తి : వెంటనే కూల్చివేతలు నిలిపివేయాలని, విగ్రహానికి కేటాయించిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని, అంబేద్కర్ విగ్రహానికి తగిన గౌరవం కల్పించాలని రాహుల్ గాంధీని దాసోజు శ్రవణ్ కోరారు.
“పేదవాడి పైకప్పును కాపాడటమే బాపూకి ఇచ్చే నిజమైన నివాళి” అని ఆయన స్పష్టం చేశారు.