బడ్జెట్ అంకెల వెనుక
అసలు వైఫల్యాలు
బయటపెట్టిన డా. శ్రవణ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ అధ్యయన సమాచరణ కేంద్రం (TASK) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డా. దాసోజు శ్రవణ్ కుమార్ రాష్ట్ర బడ్జెట్ 2025-26పై సమగ్ర విశ్లేషణను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బడ్జెట్‌ను కేవలం అంకెల పరంగా కాకుండా గవర్నర్ ప్రసంగం, ఆర్థిక మంత్రి వివరాలు, సోషియో ఎకనామిక్ సర్వే, CAG నివేదికల ఆధారంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేటాయింపులు, రివైజ్డ్ అంచనాలు మాత్రమే కాకుండా వాస్తవ ఖర్చులను పరిశీలిస్తే బడ్జెట్‌లోని లోపాలు బయటపడతాయని తెలిపారు.
రాష్ట్రం రెవెన్యూ సర్‌ప్లస్ నుండి భారీ డెఫిసిట్‌లోకి వెళ్లిందని విమర్శించిన ఆయన, ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతూ FRBM పరిమితులను అతిక్రమిస్తోందని ఆరోపించారు. వివిధ రంగాల్లో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.
వ్యవసాయం, గృహనిర్మాణం, సంక్షేమ రంగాల్లో కేటాయింపులకు సరిపడా ఖర్చు జరగలేదని, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ, పింఛన్లు వంటి హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. కేంద్రం నుండి ఆశించిన గ్రాంట్లు కూడా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.
విద్య, ఆరోగ్య రంగాల్లో జాతీయ సగటుతో పోలిస్తే తక్కువ కేటాయింపులు చేస్తున్నారని, హైదరాబాద్‌కే పరిమితమైన అభివృద్ధి విధానం రాష్ట్రానికి నష్టమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రైతు భరోసా అమలు, ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ నిధుల పూర్తి వినియోగం, జిల్లాల వారీ అభివృద్ధి వంటి అంశాలపై BRS పలు డిమాండ్లు చేసింది.
ఈ సమావేశానికి ప్రొఫెసర్ ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, డాక్టర్ అద్దంకి దాయకర్, మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు.