రాబందుల పాలనపై డా. దాసోజు శ్రవణ్ ఘాటు విమర్శలు

హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : పేదల ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదుగానీ, ఉన్న నీడను లాగేసుకుని రోడ్డున పడేయడం ఎలాంటి ప్రజాపాలనకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, నిరుపేదలపై సాగుతున్న నిరంకుశ పాలన అని ఆయన విమర్శించారు.
కష్టపడి కట్టుకున్న స్వప్న గృహం కూలిపోతుంటే ఆ కుటుంబాల కళ్లలో కనిపించే కన్నీళ్లు అధికారుల పతనానికి పునాదులు వేస్తాయని శ్రవణ్ హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం జనం బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఈ రాక్షస పాలన చరిత్రలో నిలవదన్నారు.
ప్రజల ఆశలు, ఆవేదనలు పట్టించుకోకుండా అధికార దౌర్జన్యానికి పాల్పడితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయని, పేదోడి ఉసురు తీసుకుంటున్న ఈ ‘రాబందుల’ అన్యాయానికి అంతం ఎంతో దూరంలో లేదని గట్టిగా హెచ్చరించారు.
“తస్మాత్ జాగ్రత్త!” అంటూ ప్రభుత్వానికి శ్రవణ్ స్పష్టం చేశారు.