డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోట అక్రమాలపై మౌనమేలా..!?

డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోట
అక్రమాలపై మౌనమేలా..!?

కాజీపేట, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించిన డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం మౌనం వహించడం విచారకరమని 62వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకల్లో అక్రమాలు జరిగాయని కొంతమంది క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకున్న హైకోర్టు స్పోర్ట్స్ కోట నియమాకాలపై విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో రీ వెరిఫికేషన్ చేసిన అధికారులు.. నాలుగు నెలలు గడుస్తున్న ఆ విచారణ నివేదికను బహిర్గతం చేయడం లేదని ఆరోపించారు.

కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ కూడా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే వార్తలు వెలువడుతున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియమాకాలపై బిజెపి జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ధర్మారావు, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, ఇతర నాయకుల సహకారంతో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ఏ క్రీడా సంఘం.. ఏ క్రీడాంశాల పరంగా అక్రమ నియామకాలు జరిగాయనే విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన క్రీడా సంఘాలు పైరవీలకు ఆస్కారం లేకుండా నైపుణ్యం ఉన్న అర్హులైన క్రీడాకారులనే మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అర్హతలు ఉండి.. నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగితే.. క్రీడారంగ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ అర్హులైన క్రీడాకారులను గుర్తించి వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *