డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి: ముజాహిద్ హుస్సేన్

హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్, ఈద్గా & ఖబ్రస్తాన్ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చెల్పూర్ మస్జిద్ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల వాయు, జల మరియు భూమి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత వాయువుల కారణంగా ప్రమాదకర వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పంటలు సాగు చేయడం కూడా కష్టమవుతుందని తెలిపారు. దీంతో హుజురాబాద్ పరిధిలోని ప్రజల జీవనం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

పచ్చని హుజురాబాద్‌ను కాపాడాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ప్రణవ్ బాబులకు కూడా వినతి చేశారు.
ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో హుజురాబాద్ మండలంలోని ముస్లింలతో కలిసి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఇస్మాయిల్, అంకూస్, అప్సర్, మెరాజ్, రహీం, సమీర్, వజీర్, వాజిద్, చాంద్ పాషా, అన్సారీ, షాను, అన్ను, షారుక్ మహమూద్, దస్తగిరి, హబీబ్ పాషా, సోహెల్, సోహెబ్, రఫీక్, ఆఫ్రోజ్, అహ్మద్, సాజీత్ తదితరులు పాల్గొన్నారు.