కుటుంబం సజీవదహనం

హైదరాబాద్, అక్టోబర్ 24 (విశ్వం న్యూస్) : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం హృదయ విదారకం. వి.కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 20 మంది సజీవదహనమై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ మంటల్లో నెల్లూరు జిల్లా విన్జమూరు మండలం గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (30), పిల్లలు శశాంక్ (12), మాన్యత (10) సజీవదహనమయ్యారు. రమేశ్ కుటుంబం బెంగళూరులో నివసిస్తూ, ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. అయితే మార్గమధ్యంలో బస్సు అగ్నికి ఆహుతై దుర్ఘటన చోటుచేసుకుంది.
బస్సులో రమేశ్ స్నేహితుడు తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాడు. మంటలు వ్యాపించడంతో వారు అద్దాలు పగులగొట్టి బయటపడగలిగారు. కానీ రమేశ్ కుటుంబం మాత్రం మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది.
మంటల తీవ్రతతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఈ ఘటనపై గోళ్లవారిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమేశ్ కుటుంబ మరణం స్నేహితులు, బంధువులను, గ్రామస్థులను కన్నీటిలో ముంచెత్తింది.