రైతులకు పెట్టుబడి లేదు – పాలకులకి లాభాలే!

  • హరిత తెలంగాణను నాశనం చేస్తున్న పాలన – జలవనరులపై కుట్రలు, రైతులపై దమనకాండ

హైదరాబాద్‌, జూన్ 18 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మలచిన హరితహారం, రైతులకు భరోసా ఇచ్చిన రైతుబంధు – ఇవన్నీ బాపు కేసిఆర్ పాలనను గుర్తు చేసే ప్రజానుకూల కార్యాచరణలు. కానీ నేడు అదే తెలంగాణలో రైతులపై లాఠీలు పడుతున్నాయి, అడవులు నరికేస్తున్నారు, పంట భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకునే ఆత్మగౌరవం నేడు సంకటంలో పడింది.

హరితహారం తాలూకూ గ్రీన్ స్ఫూర్తి గల్లంతు
బాపు కేసిఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఉద్యమం తెలంగాణ పల్లెలను పచ్చగా మార్చింది. గ్రామ స్థాయిలో మొక్కలు నాటించడంతో పాటు, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరిగింది. కానీ ప్రస్తుతం చెట్ల నరికివేతను అధికారికంగా ప్రోత్సహించే స్థాయికి పాలకులు దిగజారారు. దామగుండం అడవి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు విస్తరించిన నరికివేత ఇందుకు నిదర్శనం.

రైతులపై కార్పొరేట్ దాడులు
రైతుబంధు అందక సాగు చేసుకోలేక రైతులు చేతులు ఊపుతున్నారు. ఒకవైపు ఇథనాల్ కంపెనీల పేరిట భూములు లాక్కుంటే, మరోవైపు ఉద్యమిస్తున్న రైతులపై లాఠీచార్జీలు, అక్రమ కేసులు నమోదవుతున్నాయి. లగచర్ల, తాండూరు, ఎన్.కె.పల్లి, పెద్ద దన్వాడ వంటి ప్రాంతాల్లో రైతులు తమ పంట భూములను రక్షించుకునేందుకు కార్పొరేట్ యజమానులతో పోరాటం చేస్తున్నారు.

జలాధికారంపై కుట్రలు – బాబు, రేవంత్ మౌనం
తెలంగాణకు సంపూర్ణ హక్కులు ఉన్న గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో కుట్రలు మళ్లీ మొదలుపెట్టాడు. కేంద్రం మద్దతుతో వేగంగా పనులు సాగుతున్నా, సీఎం రేవంత్ మాత్రం నోరు మెదపడం లేదు. బనకచర్లపై మౌనం అనేక అనుమానాలకు దారితీస్తోంది. కింది తెలంగాణ జలవనరులను ఆంధ్రాకు అప్పగించాలన్న కుట్రలో భాగస్వామిగా ఆయన వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

కాంగ్రెస్ నేతలు బాబుకు విధేయత
ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలిసి తన విధేయత చాటుకుంటున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల బాబును కలిసిన తీరు, కాంగ్రెస్ ఆంధ్ర అనుకూల విధానాన్ని బయటపెడుతోంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బాపు కేసిఆర్ సంపాదించిన గౌరవాన్ని ఎర్రటి కార్పెట్ కింద తోసిపుచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

పాఠ్యపుస్తకాల నుంచి తెలంగాణను
తొలగించాలనే ప్రయత్నం?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించి, ఐటీ టవర్స్‌ను చరిత్రగా చదివించాలని కోరే పాలకుల తలంపు ప్రజలకు మరణశాసనమే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి తీవ్ర అవమానం.

“బాపు కేసిఆర్ లేకుండా తెలంగాణను ఊహించలేం”
తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో సీఎం కుర్చీని అప్పగించిన రేవంత్ రెడ్డి, నేడు అదే అధికారాన్ని ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఎదురుదెబ్బలు కొడితే ఢిల్లీ అధిష్టానాన్ని తిడకుండా, బాపు కేసిఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ వ్యక్తిగత రాజకీయ పగను తీర్చుకుంటున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ
కోసం ప్రజలే ముందుకు రావాలి
తెలంగాణ జల వనరులను, పచ్చదనాన్ని, రైతుల హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రజలే బలంగా నిలవాల్సిన సమయం వచ్చింది. బిఆర్ఎస్ శ్రేణులు మరింత బాధ్యతతో పనిచేయాలని సామాజిక విశ్లేషకులు సూచిస్తున్నారు. తెలంగాణ సాధించిన గౌరవాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గురుదక్షిణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *