యువకుడి కిడ్నాప్, హత్య –ఐదుగురు నిందితులు అరెస్ట్

హనుమకొండ, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : అక్రమ సంబంధం వ్యవహారంలో ఫిర్యాదు చేసి తనను సస్పెండ్ చేయించాడన్న కారణంతో ఓ కానిస్టేబుల్, యువకుడిపై కక్ష పెంచుకొని నలుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయించిన ఘటన హనుమకొండలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్ తో పాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ములుగు జిల్లా వాజేడ్ వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌కు, అదే ప్రాంతానికి చెందిన చింతం నిర్మలతో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువు చిడెం సాయి ప్రకాశ్, నిర్మల భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు.

కక్ష పెంచుకున్న శ్రీనివాస్, హత్యకు కుట్ర పన్నాడు. ఈ నెల 15వ తేదీన నిర్మల కుటుంబసభ్యులు హనుమకొండకు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్, సుపారి గ్యాంగ్ సభ్యులైన దేవిలీ సాయి (గుంటూరు), అరుణ్ కుమార్ అలియాస్ పండు, అఖిల్ నాయక్, రాజులతో కలిసి సాయి ప్రకాశ్ కారు వెంబడించి, గోపాలపురం క్రాస్ రోడ్ వద్ద అడ్డగించారు. అనంతరం అతన్ని ఆటోలో ఎక్కించి హసస్పర్తి శివారులో గొంతు బిగించి హత్య చేశారు.

హత్య అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ మండలంలోని జిల్లెడు గడ్డ తండా సమీపంలోని బావిలో పడేశారు. అనంతరం కారును హనుమకొండలోని ఏషియన్ మాల్ వద్ద పార్క్ చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హత్య కేసులో నిందితులైన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎయిర్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *