బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్ – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సీరియస్

బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్ – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సీరియస్

మంచిర్యాల, ఫిబ్రవరి 7, 2026 (విశ్వం న్యూస్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో అందించిన ఆహారం తీసుకున్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా, వారిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య శనివారం హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది అనే వివరాలను తెలుసుకున్నారు.

విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌, వైద్యులు, సిబ్బందికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిస్థాయి చికిత్స అందించాలని సూచించారు.

అనంతరం ఈ ఘటనపై జిల్లా సబ్ కలెక్టర్, IESSD మనోజ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గురుకులాల్లో పదేపదే ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన ఆహారం ఏది, విద్యార్థినులు ఏ రకమైన ఫుడ్ తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారన్న అంశాలను స్పష్టంగా తేల్చాలని తెలిపారు. అలాగే బాధ్యులెవరో గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను హెల్త్ డైరెక్టర్‌కు పంపాలని ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *