ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్
సాయిబాబా కన్నుమూత
- నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయిబాబా
- గుండెపోటుతో రాత్రి 8.45 కు మృతి చెందిన ప్రొఫెసర్ సాయిబాబా
- పది రోజుల క్రితమే అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సాయిబాబా
హైదరాబాద్, అక్టోబర్ 13 (విశ్వం న్యూస్) : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. దీంతో ఆయన దాదాపు తొమ్మిదేళ్ళ పాటు జైలులోనే ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు.
సాయిబాబా కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్‌పూర్ జైల్‌లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది.
మార్చి నెలలో నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.