ప్రజా క్షేత్రం నుంచి.. న్యాయ క్షేత్రానికి దీదీ

ప్రజా క్షేత్రం నుంచి..
న్యాయ క్షేత్రానికి దీదీ

హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2026 (విశ్వం న్యూస్) : భారత న్యాయ వ్యవస్థ డైరీలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు 4 ఫిబ్రవరి 2026. దేశ అత్యున్నత న్యాయస్థానం వేదికగా ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేవలం ఒక రాష్ట్ర అధినేతగానే కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా నల్ల కోటు ధరించి సుప్రీంకోర్టులో నిలబడటం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’
(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా, ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి స్వయంగా న్యాయవాది అవతారమెత్తి వాదనలు వినిపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే ప్రథమం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేందుకు వ్యవస్థలతో పోరాడేందుకు ఒక ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రం నుండి నేరుగా న్యాయక్షేత్రానికి తరలిరావడం ప్రజాస్వామ్య పోరాట పటిమకు నిదర్శనం. చట్టసభలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఉన్న అదృశ్య గోడలను చెరిపేస్తూ, న్యాయమూర్తుల ముందు ఆమె వినిపించిన గళం కేవలం ఒక రాజకీయ వాదన మాత్రమే కాదు; అది ప్రజాస్వామ్య పునాదులను కాపాడాలనే ఒక ఆవేదన, ఒక అరుదైన సాహసం.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ‘ సర్ ’ ప్రక్రియకు వ్యతిరేకంగా 4 ఫిబ్రవరి, 2026న సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించి చరిత్ర సృష్టించారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడం ఇదే మొదటిసారి. మమతా బెనర్జీ స్వయంగా న్యాయశాస్త్ర పట్టభద్రురాలు కావడంతో, ఆమె ‘పార్టీ ఇన్ పర్సన్’గా కోర్టు అనుమతి పొంది ఈ వాదనలు వినిపించారు.


2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ సర్ ను చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుండి అక్రమంగా తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు చేస్తున్నారని, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదని ఆమె వాదించారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియను నిలిపివేసి, 2025 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే 2026 ఎన్నికలు నిర్వహించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.


ఢిల్లీ పాలకుల సూచనల ప్రకారం ఎన్నికల అధికారులు బతికున్న వారిని కూడా చనిపోయినట్లుగా చూపి ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగిస్తున్నారని కూడా మమతా బెనర్జీ ధర్మాసనానికి వివరించారు. అదేవిధంగా ఎన్నికల అధికారులు ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా అంగీకరించడం లేదని, అదనపు పత్రాల కోసం ప్రజలను వేధిస్తున్నారని గళమెత్తారు.


కేంద్రప్రభుత్వం ఆదేశాలతోనే ఎన్నికల సంఘం ఇలా వేధింపులకు పాల్పడుతూ, పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, దానిని “వాట్సాప్ కమిషన్” అని మమతా బెనర్జీ సంబోధించారు. అదే సమయంలో ఈ సవరణ ప్రక్రియ తెచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో సుమారు 150 మంది (ఓటర్లు మరియు సిబ్బంది) మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మమతా బెనర్జీ వాదనలను విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో గ్రేడ్-2 అధికారులను ఎన్నికల విధులకు కేటాయించాలని, తద్వారా మైక్రో-అబ్సర్వర్ల అవసరం ఉండదని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను 9 ఫిబ్రవరి, 2026 (సోమవారం)కు వాయిదా వేసింది.


వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ప్రజాస్వామ్య మూలస్థంభాలు బీటలు వారుతున్నాయని ఆందోళన చెందుతున్న వేళ—మమతా బెనర్జీ వేసిన ఈ అడుగు ఒక బలమైన ఆశావాదాన్ని చిగురింపజేసింది. ఒక ముఖ్యమంత్రి సర్వ అధికారాలను పక్కన పెట్టి, సామాన్య న్యాయవాదిగా సుప్రీంకోర్టు బోనులో నిలబడటం అంటే… అది కేవలం రాజకీయ పోరాటం కాదు, న్యాయవ్యవస్థపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీక. పదవులు శాశ్వతం కాదని, ప్రజలు కల్పించిన ‘ఓటు’ అనే హక్కు మాత్రమే ప్రజాస్వామ్యంలో పరమావధి అని ఈ ఘటన చాటిచెప్పింది. భవిష్యత్తులో పాలకులు వ్యవస్థల పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో, హక్కుల కోసం ఎలా తెగించి పోరాడాలో నేర్పే పాఠం ఈ ‘దీదీ’ సాహసం. చరిత్ర దీన్ని తన ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రి చేసిన వాదనగానే కాకుండా, ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టేందుకు చేసిన న్యాయ యజ్ఞంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *