ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా
ఉద్యోగుల్లో సంబరాలు

- దశాబ్ద కాల పోరాటానికి ఫలితం
హైదరాబాద్, మార్చి 28 (విశ్వం న్యూస్): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు (ACTO) గెజిటెడ్ హోదా మంజూరు చేసినట్లు టీసీటీఎన్‌జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడించారు. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి Revanth Reddy సహా ఉన్నతాధికారుల ఆమోదం లభించిందని తెలిపారు.
దాదాపు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న డిమాండ్‌కు నేడు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. గతంలో 2017లో అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, కమిషనర్ అనిల్ కుమార్‌లకు ఉద్యోగ సంఘాలు వినతి పత్రం సమర్పించినప్పటికీ, ఈ అంశం పెండింగ్‌లోనే కొనసాగిందని గుర్తు చేశారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న 537 మంది ACTOలు గెజిటెడ్ హోదా పొందినట్లు తెలిపారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరుల సహకారం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
గ్రూప్-2 పరిధిలో ఇతర విభాగాల్లో పనిచేసే అధికారులకు గెజిటెడ్ హోదా ఉన్నప్పటికీ, వాణిజ్య పన్నుల శాఖలో ACTOలు మాత్రం ఇంతకాలం నాన్-గెజిటెడ్‌గా కొనసాగడం అన్యాయమని ఆయన అన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు తమ సంఘం దాదాపు పదేళ్లుగా పోరాటం సాగించిందని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మా సంఘం పట్టుదల, నిరంతర పోరాట ఫలితంగానే ఈ విజయాన్ని సాధించాం. అన్ని రకాల ప్రతినిధులు, పత్రాలు మా వద్ద ఉన్నాయి. అవసరమైతే ఎప్పుడైనా చూపించగలం” అని ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ హోదా మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.










