
- తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఒకేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ
హైదరాబాద్, అక్టోబర్ 12 (విశ్వం న్యూస్) : ఇందిరమ్మ ఇళ్లను పేదవారికి ఇచ్చే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మాటలతోనే కాకుండా.. చేతలతోనూ చూపిస్తోంది. ఈ ఇళ్లను పేదలకు పంచేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ కమిటీలకు ఇన్‌ఛార్జులుగా ఆయా జిల్లాల మంత్రులు ఉంటారు. అలా వారి సారధ్యంలో ఇళ్ల పంపిణీ ఉంటుంది. మొదటి దశలో 4,50,000 ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం కమిటీలు వెయ్యడం భారీ నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీల్లో ఇది ఒకటి. దీనిపై ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. ఇదివరకు కాంగ్రెస్ చరిత్రలో ఇలాంటి ఇళ్లు ఇచ్చిన సందర్భాలు ఉండటంతో ప్రజలు ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఆ కల సాకారం కాబోతోంది.
ఇళ్లు ఇవ్వాలంటే.. లబ్దిదారులు ఎవరో ముందు తేలాలి. ఇందులో తేలడానికి పెద్దగా ఏముంటుంది? తెల్ల రేషన్ కార్డుదారులంతా పేదలే. వారంతా అర్హులే అవ్వాలి. కానీ ప్రభుత్వం అలా చెప్పలేదు. లబ్దిదారులు ఎవరో తేల్చేందుకే కమిటీలు వేసినట్లు తెలిసింది. గ్రామ పంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో తెలిపింది. మరి కమిటీల వల్ల పంపిణీ ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇళ్లు ఎప్పుడు ఇస్తారో, కచ్చితమైన టైమ్‌లైన్ లేదు.
గ్రామ స్థాయిలో సర్పంచ్ లేక ప్రత్యేక అధికారి కమిటీకి ఛైర్ పర్సన్‌గా ఉంటారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్ లేక కార్పొరేటర్ ఛైర్ పర్సన్‌గా ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద (SHG) సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉంటారు. ఇలా కమిటీల ఏర్పాటు మాత్రం బాగానే చేశారనుకోవాలి.