అమ్మవారి కటాక్షాలతో గ్రామానికి శుభిక్షం

నాగారం | ఫిబ్రవరి 02 (విశ్వం న్యూస్) : కలియుగంలో కలతలతో నిండిన మనసులకు శాంతి ప్రసాదించేది దైవచింతన ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ భక్తితో పాటు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం నాగారం మండలం పస్తాల గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొజ్జ అశోక్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మినీ మేడారం జాతరలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు.
అమ్మవారి సన్నిధిలో ఆయన మాట్లాడుతూ, వనదేవతలైన సమ్మక్క–సారలమ్మ కరుణాకటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని భక్తిపూర్వకంగా వేడుకున్నారు.
గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి జాతరలు తరతరాల వరకు మన సంస్కారాలను అందిస్తాయని, అమ్మవారి భక్తితో జీవితం సక్రమ మార్గంలో సాగుతుందని ఆయన పేర్కొన్నారు. అమ్మవారి నామస్మరణతో గ్రామమంతా భక్తి పరిమళాలతో నిండిపోయిందని స్థానికులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ గౌడ్, నాగారం మండల అధ్యక్షుడు కలేట్లపెళ్లి ఉప్పలయ్య, మండల యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.