మద్యంప్రియులకు కిక్కెక్కిచ్చే శుభవార్త

హైదరాబాద్, జనవరి 20 (విశ్వం న్యూస్) : నిరీక్షణ ఫలించింది. 11 రోజుల పాటు మొహం చాటేసిన కింగ్ ఫిషర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి పండుగ సమయంలో దావత్​లో మిస్సైన ఈ తెలంగాణ ఫేవరేట్ బ్రాండ్ మళ్లీ వైన్ షాపులు, బార్లలో కనిపించి మద్యం ప్రియుల జోష్ పెంచింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో బీర్ల స‌ర‌ఫ‌రా పునరుద్ద‌ర‌ణ చేస్తున్న‌ట్లు కింగ్ ఫిషర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవ‌రీస్ లిమిటెడ్ వెల్ల‌డించింది.

ఈ నెల 8వ తేదీన నిలుపుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసిన యూబీఎల్‌ ఇవాళ స‌ర‌ఫ‌రా పున‌రుద్ద‌ర‌ణ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్ర‌భుత్వం హామీ ఇవ్వ‌డంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూబీఎల్‌ వివ‌రించారు. ప్రభుత్వ హామీతో కింగ్‌ఫిషర్‌ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం, యూబీఎల్‌ అధికారుల మ‌ధ్య చర్చలు : మార్కెట్‌లో 69శాతం వాటా ఉన్న ఈ సంస్థ స‌ర‌ఫ‌రా చేసే కింగ్‌ఫిస‌ర్‌తో పాటు ఏడు బ్రాండ్ల బీరు స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో కొర‌త ఏర్ప‌డుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ చర్య‌లు తీసుకుంది. అదే విధంగా యూబీఎల్‌ ఒత్తిళ్ల‌కు ప్ర‌భుత్వం త‌లొగ్గ‌ద‌ని కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్ప‌ష్టం చేశారు.

ఈ నేప‌థ్యంలో అటు ప్ర‌భుత్వం, ఇటు యూబీఎల్‌ అధికారుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పురోగ‌తి ఉండ‌డం, త్వ‌ర‌లో బ‌కాయిల చెల్లింపుల‌తో పాటు ధ‌ర‌ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ త‌మ‌కు వ‌చ్చింద‌ని యూబీఎల్‌ వెల్ల‌డించింది. ఇరు ప‌క్షాల మ‌ధ్య అంత‌ర్గ‌త ఒప్పందం మేర‌కు తాము పున‌రుద్ద‌ర‌ణ చేస్తున్న‌ట్లు యూబీఎల్‌ మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివ‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *