గ్రామాలకు కేంద్రం శుభవార్త:
రూ.259.36 కోట్ల నిధులు

హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తూ తొలి విడతగా రూ.259.36 కోట్లను మంజూరు చేసింది. కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో కేంద్ర ఆర్థిక శాఖతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఈ సాయం కొత్త ఊపిరి పోయనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. దీంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పంచాయతీల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను నిలిపివేసింది.
కేంద్ర నిబంధనల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు (సర్పంచ్లు) ఉన్నప్పుడే నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ అవుతాయి. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తైంది. విడుదలైన నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది.