ఆర్‌టీఐ అమలులో ప్రభుత్వం విఫలం-మండలిలో దాసోజు శ్రవణ్ విమర్శలు

ఆర్‌టీఐ అమలులో ప్రభుత్వం విఫలం-మండలిలో దాసోజు శ్రవణ్ విమర్శలు

హైదరాబాద్, మార్చి 18 (విశ్వం న్యూస్): : రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మండలిలో ఆరోపించారు. ప్రజలకు సమాచారం అందించే వ్యవస్థలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.

ఆర్‌టీఐ చట్టం ప్రకారం ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌లో కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) అందుబాటులో లేవని శ్రవణ్ తెలిపారు. చిన్నచిన్న బదిలీలు లేదా పరిమిత అంశాలకు సంబంధించిన జీవోలు మాత్రమే ఉంచి, ముఖ్యమైన టెండర్లు, నిధుల కేటాయింపులకు సంబంధించిన జీవోలను “క్లాసిఫైడ్”, “కాన్ఫిడెన్షియల్” పేరుతో ప్రజలకు అందకుండా దాచిపెడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలోని అనేక శాఖల్లో ఆర్‌టీఐ దరఖాస్తుల్లో 95 నుంచి 98 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజలకు సమాచారం ఇవ్వాలనే చట్టబద్ధ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించకపోవడమేనని అన్నారు.

రాష్ట్రంలో దాదాపు 12 వేలకుపైగా ప్రజా సమాచారం అధికారులు (PIOలు) ఉన్నప్పటికీ, కేవలం 200కు తక్కువ శాఖలే ఆన్‌లైన్ ఆర్‌టీఐ పోర్టల్‌లో నమోదు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని శ్రవణ్ తెలిపారు. డిజిటల్ యుగంలో ప్రజలకు సమాచారం సులభంగా అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా, ప్రజాప్రతినిధులుగా తాము ఆర్‌టీఐ కింద సమాచారం కోరినా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. HMDA, GHMC, HYDRA వంటి సంస్థల వద్ద సమాచారం కోరినా సమాధానం రావడం లేదని అన్నారు.

ఈ పరిస్థితిపై శాసన మండలి చైర్మన్ దృష్టి సారించి, ప్రభుత్వాన్ని కఠినంగా ఆదేశించి ఆర్‌టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *