మిట్టపల్లి సురేందర్‌కు గద్దర్ అవార్డు ఇవ్వకపోవడంపై ఆవేదన

హైదరాబాద్, మార్చి 21 (విశ్వం న్యూస్): ప్రజా కళాకారుడు మిట్టపల్లి సురేందర్‌కు గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డును ప్రదానం చేయకపోవడంపై తెలంగాణ కళాకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. మట్టినుండి ఎదిగిన ప్రజా కళాకారులను విస్మరించడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
తెలంగాణ నేల ప్రజా కళాకారులకు, కవులకు పుట్టినిల్లుగా నిలిచిందని, పల్లెల మట్టి పరిమళాల నుంచి వెలివాడల వరకు అనేక మంది కళాకారులు ప్రజల కోసం పాటలు పాడుతూ ఉద్యమాలకు బలం చేకూర్చారని గుర్తుచేశారు. చెరబండ రాజు, డోలక్ దయన్న, బెల్లి లలిత, ఎర్ర ఉపాళి, తొర్రూరు ఐలన్న వంటి అమర కళాకారులు తెలంగాణ విముక్తి కోసం తమ కళను అంకితం చేశారని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలు, కన్నీళ్లను గానం చేసిన ప్రజా కళాకారుడు మిట్టపల్లి సురేందర్‌కు గద్దర్ అవార్డు ఇవ్వకపోవడం పాలకుల భావ దారిద్ర్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా కళాకారుడు ప్రజల మనస్సులు గెలుచుకుంటాడని, ప్రజలు ఇచ్చే గౌరవమే అసలైన అవార్డని వారు అభిప్రాయపడ్డారు.
లక్షలాది తెలంగాణ ప్రజల గుండెల్లో మిట్టపల్లి సురేందర్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఆయనను మరిపించడం సాధ్యం కాదని తెలిపారు.
