మూసీ తీరాన ఆలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ

మూసీ తీరాన ఆలయాల
పునర్నిర్మాణానికి భూమిపూజ

హైదరాబాద్, మార్చి 28 (విశ్వం న్యూస్) : మంచిరేవులలో మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణ శుభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ పునర్‌నిర్మాణం దైవ సంకల్పంతో జరుగుతోందని, ఎనిమిది ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ ప్రాంతానికి సుమారు 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదని, ఇప్పుడు ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. విమర్శలు, అడ్డంకులు వచ్చినా దేవుడి ఆశీస్సులతో వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మతసామరస్యానికి ప్రాధాన్యత ఇస్తూ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరించిన సీఎం, మూసీ ప్రక్షాళనకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి కృపతో మూసీ శుద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *