జీఎస్టీ బకాయిలు
వెంటనే చెల్లించాలి:
ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వ్యాపారులు, వివిధ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించవలసిన జీఎస్టీ మరియు ఇతర పన్నులను వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సమయానికి చెల్లించడం అవసరమని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వ్యాపారులు, కంపెనీ యజమానులు తమ జీఎస్టీ GSTR-3B రిటర్న్స్ ను సకాలంలో ఫైల్ చేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం అందేలా సహకరించాలని ఆయన కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న DRC-07 బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సూచించారు.
జీఎస్టీ అమలుకు ముందు ఉన్న వాట్, సిఎస్‌టి, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నుల బకాయిలను కూడా వ్యాపారులు, కంపెనీల యజమానులు వెంటనే చెల్లించాలని ముజాహిద్ హుస్సేన్ కోరారు. అదేవిధంగా IGST సహా అన్ని రకాల పన్నులను సమయానికి చెల్లించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.